ABN , First Publish Date - 2023-03-22T02:10:42+05:30 IST
భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అనే వ్యవస్థ ఒకటి ఉన్నదా అన్న అనుమానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (రెండో విడత) ప్రారంభమై వారం రోజులవుతున్నప్పటికీ ఒక్క రోజు కూడా పట్టుమని పది నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరగలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఈ సారి సమావేశాలు జరగకపోవడానికి ప్రతిపక్షాలతో పాటు ప్రభుత్వం కూడా కారణం కావడం. ..................................
పదవీవిరమణ చేసిన రక్షణ సిబ్బందికి ఒక ర్యాంకు, ఒక పింఛను పథకం (ఓఆర్ఓపి) క్రింద పింఛను బకాయీలు చెల్లించే విషయంపై కూడా ప్రభుత్వం తమకు సీల్డ్ కవర్‌లో వివరాలు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సోమవారం తప్పుపట్టింది. సైనిక సిబ్బంది పింఛను వివరాలకు నోట్ సమర్పించమని అడిగినప్పుడు అది రహస్య సమాచారం అని అటార్నీ జనరల్ సీల్డు కవర్ సమర్పించబోయారు. ‘సీల్డు కవర్ సంస్కృతి సహజ న్యాయ విచారణా క్రమానికి మౌలికంగా విరుద్ధం. సమాచారం ఇవ్వడం ద్వారా ఎవరి ప్రాణాలకైనా ఇబ్బంది కలుగుతుందంటే ఆలోచించాల్సి ఉంటుంది. కాని ఇది పింఛను చెల్లింపు వ్యవహారం, ఇందులో గొప్ప రహస్యం ఏముంది?’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ పర్దీవాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం అదానీ–హిండన్‌బర్గ్ వ్యవహారం విచారించేందుకు కేంద్రం నిపుణుల కమిటీ పేర్లను సీల్డ్ కవర్‌లో ప్రతిపాదిస్తానని చెప్పినప్పుడు కూడా జస్టిస్ చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తపరిచిన విషయం తెలిసిందే.
ఓఆర్ఓపి బకాయీల విషయంలో అటార్నీ జనరల్ చెప్పిన వివరాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. 2019–22 సంవత్సరాలకు సంబంధించి పేరుకుపోయన రూ. 28 వేల కోట్ల బకాయీలు ఒకేసారి చెల్లించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నిస్సహాయత వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక విధానానికి సంబంధించిన విషయం అని ఆయన అన్నారు. ఇదేనా సీల్డు కవర్‌లో కేంద్రం చెప్పాలనుకున్న రహస్యం? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సరిహద్దుల్లో పోరాడే సైనికుల గురించి తమకే అభిమానం ఉన్నట్లు ఈ అంశాన్ని తమ దేశభక్తి ఎజెండాలో చేర్చింది. సైనికుల త్యాగాలను దేశభక్తిని వ్యక్తం చేసేందుకు కీర్తించడం మంచిదే కావచ్చు కాని వారు పదవీవిరమణ చేసిన తర్వాత పింఛను ఎప్పటికప్పుడు చెల్లించేందుకు వెనుకాడడాన్ని ఏమనాలి? 2019 నుంచీ ఈ బకాయీలు పెండింగ్‌లో ఉన్నాయి.
నిజానికి 2011లోనే బిజెపి సీనియర్ నేత భగత్ సింగ్ కోషియారీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీయే సైన్యంలో అన్ని వర్గాలతో మాట్లాడిన తర్వాత ఓఆర్ఓపి పథకాన్ని బలంగా ప్రతిపాదించింది. ఒకే ర్యాంకులో ఒకే సర్వీసుతో పదవీవిరమణ చేసిన సాయుధ దళాలకు ఎప్పుడు రిటైరయ్యారన్న విషయంతో నిమిత్తం లేకుండా ఒకే పింఛను చెల్లించాలని సిఫారసు చేసింది. యుపిఏ ప్రభుత్వం ఈ సిఫారసులను అమలు చేయకపోవడాన్ని బిజెపి తీవ్రంగా తప్పుపట్టింది. తాము అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ 2014లో హర్యానాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో వేలాది మాజీ సైనికుల సమక్షంలో ప్రకటించారు, ఆయన ప్రకటించినప్పుడు మాజీ సైనిక ప్రధానాధిపతి జనరల్ వికె సింగ్ ప్రక్కనే ఉన్నారు. చాలా సభల్లో ఆయన తన ప్రసంగాలను ‘జై జవాన్, జై కిసాన్’ అంటూ ప్రారంభించేవారు. ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 అక్టోబర్ 23వ తేదీన దీపావళిని ఆయన సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులతో గడిపినప్పుడు కూడా ఈ పథకం అమలు అయినట్లేనని ప్రకటించారు కాని 2014, 2015 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. స్వచ్ఛంద పదవీవిరమణ చేసిన సైనికులకు కూడా ఓఆర్ఓపి ప్రయోజనాలు వర్తిస్తాయని, సైనికుల ఆత్మగౌరవం కంటే తమకు ఏదీ ఎక్కువ కాదని 2015 ఫిబ్రవరిలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన ప్రకటించారు. కాని ఇదే మోదీ ఒక సందర్భంలో ఓఆర్ఓపి అంటే ఏమిటో నిర్వచించాల్సి ఉన్నదని మాట్లాడి మాజీ సైనికుల్లో సందిగ్థం కలిగించారు. ఓఆర్ఓపి అమలు ఆలస్యం వల్ల వారిలో అసహనం పెరిగిపోవడంతో ఇలా మాజీ సైనికులను అవమానించవద్దని నలుగురు సాయుధ దళాల మాజీ అధిపతులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, పది మంది అధిపతులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అసాధారణ రీతిలో లేఖ రాశారు. మాజీ సైనికులు జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసినా, 300 రోజులకు పైగా రిలే నిరాహార దీక్షలు జరిపినా, ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరించినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఒక దశలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మాజీ సైనికులపై లాఠీఛార్జీ జరిగింది. ఒక మాజీ సైనికుడు 2016 నవంబర్‌లో జంతర్ మంతర్ వద్ద ఆత్మహత్య కూడా చేసుకున్నారు. అనేకమంది కొత్త పింఛను కళ్లచూడకుండానే మరణించారు.
2015 నవంబర్ 7న విధాన నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ మోదీ ప్రభుత్వం మాజీ సైనికులకు పింఛను చెల్లింపు విషయంలో స్పష్టతను అనుసరించలేదు. కమిషన్ నియామకంతో కాలయాపన జరిగింది. మా ప్రభుత్వం సాయుధ దళాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది. ‘మన సైన్యం దేశానికి అపారమైన సేవ చేస్తోంది. అది దేశ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక’ అని మోదీ 2019లో ట్వీట్ చేశారు. 2019 జూలై 1 నుంచి నాలుగు అర్ధ సంవత్సర వాయిదాల్లో ఈ పింఛను చెల్లిస్తామని కూడా ఒక దశలో కేంద్రం ప్రకటించింది. ఆ లెక్కన 2020 డిసెంబర్ లోపు ఈ పింఛను చెల్లింపులు పూర్తి అయి ఉండాలి. నిర్మలా సీతారామన్ తాను రక్షణమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక మంత్రిగా ఇప్పుడు నిస్సహాయత వ్యక్తం చేయడం ఎంత వైరుధ్యం? ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ పథకానికి రూ.35వేల కోట్లు మంజూరు చేశారని, అన్ని బకాయీలూ చెల్లించి వ్యత్యాసాలు లేకుండా చేస్తామని రక్షణమంత్రిగా ఆమె ప్రకటించారు. సాయుధ దళాల సమస్యల పట్ల తమ ప్రభుత్వం సున్నిత వైఖరితో ఉన్నదని చెప్పుకున్నారు. ఓఆర్ఓపి పథకం గురించి ఎన్నికల సభల్లో కూడా బిజెపి ప్రచారం చేసుకున్నది. ఓఆర్ఓపి అంటే కాంగ్రెస్‌కు ‘వన్ రాహుల్, వన్ ప్రియాంక’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో విమర్శించారు.
2022 డిసెంబర్ 23న కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఈ పథకాన్ని ఆమోదించినప్పటికీ ఇది చాలా మంది జవాన్లకు సంతృప్తిగా లేదు. అది ఆఫీసర్లకే ఉపయోగకరంగా ఉన్నదని అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సైన్యంలో ఉన్నతాధికారికి వచ్చే పింఛనుకూ, ఒక జవానుకు వచ్చే పింఛనుకూ తీవ్ర వ్యత్యాసం కనపడుతోంది. ఆఫీసర్ ర్యాంకుకు తక్కువగా ఉన్న యుద్ద వితంతువుల పింఛన్‌ను కూడా పెంచలేదు. ఆఖరుకు బకాయీల చెల్లింపుల విషయంలో కూడా కేంద్రం జాప్యం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఒక దశలో ధిక్కరించడంతో ప్రధాన న్యాయమూర్తి రక్షణ శాఖ కార్యదర్శిని అఫిడవిట్ దాఖలు చేయమని ఆదేశించాల్సి వచ్చింది. తమకు 2024 ఏప్రిల్ వరకూ సమయం ఇవ్వమని కేంద్రం కోరితే 2024 ఫిబ్రవరి వరకు బకాయీలు చెల్లించమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ‘కేంద్రం మా దగ్గర డబ్బుల్లేవంటే మేము మాత్రం ఏమి చేయగలం?’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకు కొన్ని వేల కోట్లు బకాయపడిన ఈ దేశంలో, అదానీ లాంటి వారి వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు అపారంగా నష్టపోయిన భరత భూమిలో సైనికులకు ఎప్పటికప్పుడు పింఛను చెల్లించడానికి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అడ్డుపడుతోందా? ఒకవైపు 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చెప్పుకునే ఈ దేశంలో సైనికులకు ఒకేసారి పింఛను చెల్లించడం కష్టమని సుప్రీంకోర్టు ముందు బీద అరుపులు అరవడం ఎంత విషాదకరం?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
(Source : Andhrajyothi)
No comments:
Post a Comment