Wednesday, December 23, 2015

మాజీ సైనికుల సంక్షేమానికి పెద్దపీట

PUBLISHED: WED,DECEMBER 23, 2015 01:23 AM
 
మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రెండు నెలల క్రితం మాజీ సైనికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండో ప్రపంచ యుద్ధసైనికులు, వారి కుటుంబాలకు అందించే పింఛన్ పెంపు, మాజీ సైనికుల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, నూతన పథకాల అమలు కోసం సీఎం అధ్యక్షతన తెలంగాణ రాజ్య సైనిక్‌బోర్టు ఏర్పాటు, సమస్యల పరిష్కారానికి డీజీపీ నేతృత్వంలో కమిటీ నియామకం తదితర అంశాలు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి.


-సీఎం అధ్యక్షతన తెలంగాణ రాజ్యసైనిక్ బోర్డు 
-ప్రపంచ యుద్ధ సైనికులకు వందశాతం పింఛన్ పెంపు
-సమస్యల పరిష్కారంపై డీజీపీ నేతృత్వంలో కమిటీ 
-అభినందనీయమంటున్న మాజీ సైనికుల సంక్షేమ సంఘం


ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు మాజీ సైనికులను ఏనాడు పట్టించుకోలేదు. వారి ఆవేదన అరణ్యరోదనగానే ఉంటూ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ మాజీ సైనికులతో తన నివాసంలో ప్రత్యేకంగా భేటీఅయ్యారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీలకు కార్యరూపమిస్తూ ఉత్తర్వులు వెలువరించటంతో మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసినైట్లెంది. 


నెరవేరిన దీర్ఘకాల డిమాండ్..


రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు, మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలనుంచి రూ.6 వేలకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించారు. నాటి యుద్ధంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన 200మంది సైనికులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు వీరికి నెలకు రూ.3వేల పించన్ ఇచ్చాయి. రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసిన మాజీ సైనికుల సంఘం ఈ పెన్షన్ పెంచాలని విజ్ఞప్తి చేసింది. దేశంకోసం ప్రాణాలకు తెగించిన పోరాడిన వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ సీఎం, వారి పెన్షన్‌ను వంద శాతం పెంచుతానని మాట ఇచ్చారు. ఆ మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. 


డీజీపీ నేతృత్వంలో కమిటీ.. 


మాజీ సైనికులకు ఎదురవుతున్న సమస్యలు పరిశీలించి వాటి పరిష్కార మార్గాలు సూచించేందుకు డీజీపీ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు వెలువరించింది. ఈ కమిటీకి హోంశాఖ కార్యదర్శి వైస్ చైర్మన్ కాగా, సభ్యులుగా కెప్టెన్ ఎం సురేశ్‌రెడ్డి, సార్జెంట్ ప్రభాకర్‌రావు, నాయిక్ ఎల్ జగన్‌రెడ్డి, సిపాయి కేఎస్ ప్రాన్సిస్, నాయిబ్ సుబేదార్ జీ పోచయ్య, సార్జెంట్ పీ మనోహర్‌రెడ్డిలను నియమించారు. ఈ కమిటీ పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 


సీఎం అధ్యక్షుడిగా బోర్డు.. 


మరోవైపు రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు, వాటి పర్యవేక్షణ, నూతన పథకాలు.. ఇతరత్రా వ్యవహారాలను సమీక్షించడానికి సీఎం అధ్యక్షతన 28మంది అధికారిక సభ్యులు, 8మంది అనధికారిక సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులతో తెలంగాణ రాష్ట్ర రాజ్యసైనిక్ బోర్డు ఏర్పాటుచేశారు. ఉపాధ్యక్షులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మాజీ సైనికుల సంక్షేమ శాఖ కార్యదర్శి, అదనపు ఉపాధ్యక్షులుగా సదరన్ కమాండ్ జనరల్ ఆఫీసర్, ఫ్లాగ్ ఆఫీసర్ ఈస్ట్రర్న్ నావల్ కమాండ్ విశాఖ, అధికారిక సభ్యులుగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్లానింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇండస్ట్రీస్ కమిషనర్, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, రిజిస్ట్రేషన్ కమిషనర్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ, టీఎస్‌ఆర్టీసీ ఎండీ, ఎస్‌బీహెచ్ ఎండీ, బ్యాంకర్స్ కన్వీనర్, చిన్నతరహా పరిశ్రమల డీజీఎం, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ సబ్‌ఏరియా, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ కమాండర్, ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, టూరిజం డైరెక్టర్, రాష్ట్ర ఖాదీ బోర్డు సీఈఓ, నాబార్డ్ మేనేజర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఉన్నత విద్య సెక్రటరీ, సైనిక్ సంక్షేమ విభాగపు డైరెక్టర్లు ఉంటారు. అనధికారిక సభ్యులుగా మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎస్‌క్యూఎన్ ఎల్‌డీఆర్ జయసింహ, బ్రిగేడియర్ పి గణేశం, కెప్టెన్ బీహెచ్ రెడ్డి, నార్న రవికుమార్, వనితాదాట్ల, యశోద హాస్పిటల్ ఎండీ సురేందర్‌రావులను నియమించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్ రీసెటిల్‌మెంట్, కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యదర్శి, పుణె సదరన్ హెడ్‌క్వార్టర్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లా కలెక్టర్లు ఉన్నారు. 


సీఎంకు కృతజ్ఞతలు...


తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉండటామని ఆలిండియా ఎక్స్ సర్వీస్‌మెన్ అసోసియేషన్ పేర్కొంది. ఈ విషయంలో చొరవ చూపిన మాజీ మంత్రి, కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు కూడా కృతజతలు తెలుపుతున్నామని ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి నాయిక్ ఎల్ జగన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ తమకోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి తమ సమస్యలు వినడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను కార్యరూపం ఇస్తూ ఉత్తర్వులు వెలువరించడం అభినందనీయమని అన్నారు.
(Source- క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ)


1 comment:

  1. he same manner recently our three COS has raised the complaint to Mr RM for the bridging the gap to counterpart of IAS/IPS in connection of Allowances been see the anomalies of our poor veterans.

    ReplyDelete