Saturday, September 3, 2016

ప్రధాని మోదీ ఇంటర్వ్యూ... నా పనితీరును ప్రజలకే వదిలేస్తున్నా

Dear all

 Please click and listen to PM's interviewto ETV in Hindi)




(Source- Youtube)
Telugu Version ---
* రెండేళ్ల క్రితం చరిత్రాత్మక ప్రజాతీర్పుతో అధికారానికి వచ్చారు. ఈ రెండేళ్లను ఎలా చూస్తారు? మీరు సాధించిన గొప్ప విజయం? 
నేను ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాల 3 నెలలు గడిచాయి. భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాల పనితీరును అంచనా వేస్తుంటారు. మీడియా కూడా ఆ పని చేస్తోంది. ఇటీవలికాలంలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్వే సంస్థలూ ఆ పని చేస్తున్నాయి. ఇలా చేయడం మంచిదే. అందుకే, నా ప్రభుత్వ పనితీరును అంచనా వేయడం ప్రజలకే వదిలేస్తున్నా. అయితే, మేం అధికారానికి రాకముందు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేది, మీడియా ఏం చర్చిస్తూ ఉండేదనే విషయాన్ని మాపై అంచనాలు వేసే సమయంలో మరచిపోవద్దని కోరుకుంటా. అప్పట్లో పత్రికల నిండా అవినీతి, నిస్పృహతో కూడిన వార్తలుండేవి. ప్రజలు భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయారు. అంతా మునిగి పోయిందనే భావన వ్యక్తమయ్యేది. వైద్యుడు ఎంత గొప్పవాడైనా రోగి నిరాశలో పడిపోతే మందులు పని చేయవు. రోగిలో కోలుకుంటానన్న ఆశ ఉంటే సాధారణ వైద్యుడైనా నయమవుతుంది. కారణం రోగి నమ్మకమే. నేను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నిస్పృహ వాతావరణాన్ని తొలగించడానికి, దేశ ప్రజల్లో ఆశ, నమ్మకాన్ని కల్పించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చాను. ఇది ప్రసంగాలతో అయ్యే పనికాదు. పలు చర్యలు తీసుకోవాలి. అవి ఫలితాలను ఇవ్వాలి. రెండేళ్ల తర్వాత ఇప్పుడు నమ్మకంగా చెప్పగలను, ఈ దేశ ప్రజలకే కాదు, మొత్తం ప్రపంచానికే దేశంపై విశ్వాసం పెరిగింది. 
ఒకప్పుడు భారత్‌ను మునిగిపోయిన పడవ లాగా చూశారు. బ్రిక్స్‌లో ‘ఐ’ను తిరగబడ్డ అక్షరంగా చూసేవారు. ఇప్పుడు బ్రిక్స్‌లో మెరిసిపోతున్నది భారతే. ఈ రకంగా కూడా మా ప్రభుత్వాన్ని అంచనా వేయొచ్చు.
వైద్యుడు ఎంత గొప్పవాడైనా రోగి నిరాశలో పడిపోతే మందులు పని చేయవు. రోగిలో కోలుకుంటానన్న ఆశ ఉంటే సాధారణ వైద్యుడైనా నయమవుతుంది. కారణం రోగి నమ్మకమే. నేను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నిస్పృహ వాతావరణాన్ని తొలగించడానికి, దేశ ప్రజల్లో ఆశ, నమ్మకాన్ని కల్పించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చాను. ప్రసంగాలతో అయ్యే పనికాదు. చర్యలు తీసుకోవాలి. అవి ఫలితాలను ఇవ్వాలి. రెండేళ్ల తర్వాత ఇప్పుడు నమ్మకంగా చెప్పగలను, ఈ దేశ ప్రజలకే కాదు, ప్రపంచానికే దేశంపై విశ్వాసం పెరిగింది.
* అధికారానికి వచ్చాక అతిపెద్ద సవాలు ఆర్థిక వ్యవస్థ. దాన్ని గాడిలో పెట్టడమే కాకుండా వేగం పెంచే బాధ్యత కూడా మీ మీద పడింది. దీన్నెలా అంచనా వేస్తారు? ఇందులో మీరు సాధించిందెంత? 
నిజమే. అప్పుడు ఒక ప్రతికూల వాతావరణం ఉండేది. కొన్నాళ్లు దాని ప్రభావం కొనసాగింది. దేశంలోని వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు దాన్ని గుర్తించారు. ప్రభుత్వంలో నిష్క్రియాపరత్వం ఏర్పడింది. మరోపక్క మేం వరుసగా రెండేళ్లు కరవును ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మందగమనం ఆవహించింది. వరుసగా సవాళ్ల మీద సవాళ్లు. మేం ప్రభుత్వానికి వచ్చాక కూడా కొనసాగాయి. కానీ, సంకల్ప బలం, విస్పష్ట విధానాలు, వూగిసలాట లేని నిర్ణయాలతో ముందుకు వెళ్లాం. వాటిలో స్వార్థ ప్రయోజనాలు లేకపోవడంతో సానుకూల వాతావరణం శరవేగంగా విస్తరించింది. స్వాతంత్య్రానంతరం ఈ ఏడాది దేశంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సాధించాం. 7 శాతం వృద్ధిరేటుతో భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, పరపతి రేటింగ్‌ సంస్థలు, ఐరాస సంస్థలు అన్నీ భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెబుతున్నాయి. అభివృద్ధికి ఉపయోగపడుతున్న విధానాలకు ప్రాధాన్యం ఇచ్చాం. అవరోధాలుంటే విధాన నిర్ణయాల ద్వారా తొలగించాం. దాంతో ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకుంది. ఈ ఏడాది వర్షాలు బాగున్నాయి. ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి అయిన వ్యవసాయం పచ్చగా ఉంది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఇంకా బాగుంటుందన్న ఆశలు పెరిగాయి. ప్రస్తుతం ప్రతీ రంగంలో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం భారీగా పెరిగాయి. మౌలిక సదుపాయాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ ఉన్నపుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఇవన్నీ చూస్తుంటే మనం మంచి రోజుల్లోకి వెళ్తున్నామని అనిపిస్తోంది.
* మోదీ గారూ.. మీరు నల్లధనంపై కొరడా ఝుళిపించినట్టు కనిపిస్తున్నారు. అందువల్లనే చిన్న వ్యాపారులు దుబాయిలోనో, లండన్‌లోనో దాక్కున్నట్టు కథనాలు వస్తున్నాయి. మీరు రాజకీయ వారసత్వాలను కూడా మినహాయించినట్టు లేదు. ఈ ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందా? 
ముందుగా రాజకీయ దృక్పథం వైపు నుంచి చూద్దాం. నేను ఎన్నడూ దీని గురించి ఆలోచించలేదు, భవిష్యత్తులో చేయను కూడా. 14 ఏళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాను. రాజకీయ ప్రయోజనాల దృష్టితో ఎన్నడూ ఏ దస్త్రాన్నీ ముట్టుకోలేదు. ఎలాంటి ఆరోపణలనూ ఎదుర్కోలేదు. దీనికి చరిత్రే సాక్ష్యం. ఇక్కడికి వచ్చి రెండేళ్లు దాటింది. ఏ దస్త్రాన్నైనా తెరవాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలూ వెలువడలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేం రాజకీయ వారసత్వాలనూ మినహాయించినట్టు లేదని అనటం సరైనది కాదు. రెండో విషయం.. అధికారం చేపట్టిన వెంటనే కేబినెట్‌ తీసుకున్న తొలి నిర్ణయం నల్లధనంపై సిట్‌ను ఏర్పాటు చేయటం. సుప్రీంకోర్టు సైతం లేవనెత్తిన ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లుగా మూలన పడింది. సిట్‌ తన పని తాను చేస్తోంది. దీని పురోగతిని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. మేం చేసిన మరో ముఖ్యమైన పని.. నల్లధనాన్ని విదేశాలకు తరలించాలంటే భయపడేలా పటిష్ఠమైన నల్లధనం చట్టాన్ని తేవటం. ప్రస్తుతం కొత్తగా నల్లధనమన్నది లేదు. దేశంలో నల్లధనం చెలామణిని అరికట్టేందుకూ చట్టంలో తగు మార్పులు చేశాం. నల్లధనం వెల్లడికి పథకాన్ని తెచ్చాం. ఇది సెప్టెంబరు 30తో ముగుస్తుంది. ప్రధాన స్రవంతిలోకి రావాలని భావిస్తున్న వారందరికీ ఇదే చివరి తేదీ. ఉద్దేశ పూర్వకంగానో, తెలియకుండానో.. ఏ ఉద్దేశంతోనైనా గానీ గతంలో (నల్లకుబేరులు) తప్పులు చేసి ఉండొచ్చు. వీరికి ఆదాయవెల్లడి పథకం ఒక మంచి అవకాశం. ప్రధాన స్రవంతిలోకి రండి. రాత్రిపూట కంటి నిండా నిద్ర పోవటానికే ఈ పథకాన్ని తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని అంగీకరించాలి. 30 తర్వాత ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే మాత్రం నన్ను నిందించొద్దు. ఇది పేద ప్రజల సొమ్ము. దీన్ని దోచుకునే హక్కు ఎవరికీ లేదు. ఇదే నా నిశ్చితాభిప్రాయం. పూర్తి శక్తియుక్తులతో పని చేస్తున్నా. దీన్ని కొనసాగిస్తా. 


ఎంత సంపద ఉన్నా కుటుంబ ఐక్యతే ముఖ్యం!
* అభివృద్ధి నినాదంతోనే అధికారానికి వచ్చారు. అతికష్టం మీద జీఎస్‌టీ బిల్లుకు ఆమోదం పొందారు. ఇది ఎలాంటి విజయం? దీనివల్ల సామాన్యుడికి ఒరిగేదేమిటి? 
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదే అతిపెద్ద పన్ను సంస్కరణ. ఇది భారతదేశంలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. ప్రస్తుతం దేశంలో చాలా కొద్దిమంది మాత్రమే పన్నులు కడుతున్నారు. కొందరు దేశభక్తితో, దేశానికేమైనా చేయాలన్న సంకల్పంతో పన్ను కడుతున్నారు. కొందరు చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం లేక పన్నులు కడుతున్నారు. కొందరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పన్నులు కడుతున్నారు. ఇంకా చాలా మంది పన్నులు కట్టడం లేదు. ఇదేదో సంక్లిష్టమైన వ్యవహారం అయినందువల్ల కాదు. అందులో ఇరుక్కుంటే బయటకు రాలేమేమోనన్నది వారి భయం. వస్తుసేవా పన్ను... పన్ను చెల్లింపుల విధానాన్ని సరళతరం చేస్తుంది. దేశాభివృద్ధికి సాయం చేయాలని మనసులో ఏ మూలనైనా కాస్తంత ఉన్నవాళ్లు తప్పకుండా పన్ను కట్టడానికి ముందుకు వస్తారు.
రాష్ట్రాల సరిహద్దుల్లో ఆక్ట్రాయ్‌ పేరుతో చెక్‌ పోస్టులు, మైళ్ల తరబడి వాహనాలు వేచివుండే దృశ్యాలు ఇక ఉండవు. ఇలా వాహనాలు నిలబడటం దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం. ఇక ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళతాయి. పన్ను విధానం మరింత తేలికవుతుంది. సామాన్యుడికి లాభం. పెరిగే ఆదాయం దేశాభివృద్ధికి ఉపయోగ పడుతుంది. పారదర్శకమైన జీఎస్‌టీ వల్ల రాష్ట్రాల మధ్య అపనమ్మకాలకు తెర పడుతుంది. సమాఖ్య నిర్మాణం బలోపేతం అవుతుంది.
ప్రస్తుతం హోటల్‌కు వెళ్తే బిల్లులో ఆ సెస్సు, ఈ సెస్సు వేస్తున్నారు. బిల్లు ఇంతయితే సెస్సు ఇంతయిందంటూ మీరే వాట్సాప్‌లో బిల్లు ఫొటోలు షేర్‌ చేస్తున్నారు. ఇలాంటివి ఇక ఉండవు.
* ఆర్థిక పురోగతిలో సామాజిక సామరస్యం ప్రాముఖ్యత ఎంత? 
ఆర్థిక పురోగతి ఒక్కటే పరిష్కారం కాదు. శాంతి, ఐక్యత, సామరస్యం సమాజానికి చాలా అవసరం. ఒక కుటుంబానికి ఎంత సంపద ఉన్నప్పటికీ కుటుంబ ఐక్యత చాలా ముఖ్యం. సమాజానికీ ఇదే వర్తిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఐక్యంగా, సామరస్యంగా మెలగాలి. సామాజిక న్యాయానికి మనం కట్టుబడాలి. అందువల్ల ఆర్థిక పురోగతి ఒక్కదాని కోసమే ఐక్యత అనేది ముఖ్యం కాదు. శాంతి, ఐక్యత, సామరస్యాలు.. కుటుంబానికి, జీవితానికి, సమాజానికి, జాతికి, ‘వసుధైక కుటుంబం’ భావనను నమ్మిన వారికి ఉపయోగకరం. 

మౌనంగా జరుగుతున్నవెన్నో...
* వర్షాలు బాగున్నాయన్నారు. నిజమే. షేర్‌ మార్కెట్‌ కూడా పెరిగింది. తర్వాతి దశ సంస్కరణలు ఎలా ఉండబోతున్నాయి?
ప్రస్తుతం దేశంలో అంతా చర్చించుకున్న వాటినే సంస్కరణలుగా భావిస్తున్నారు. బయటకు మాట్లాకుండా మౌనంగా జరిగిపోతున్న వాటిని సంస్కరణలుగా భావించడం లేదు. అది మన అజ్ఞానం. సంస్కరించు (రీఫార్మ్‌), అమలుచేసి చూపించు(పెర్ఫార్మ్‌), మార్పు సాధించు(ట్రాన్స్‌ఫార్మ్‌) అన్నది నా ప్రభుత్వ నినాదం. ఇప్పుడు అందరికీ తెలియజేయడం (ఇన్ఫార్మ్‌) అనే పదాన్ని కొత్తగా జత చేస్తున్నా. సులువుగా వ్యాపారం చేసుకొనే వాతావరణం అనే అంశాన్ని తీసుకుందాం. ఇందులో మన స్థానం(ర్యాంకింగ్‌) వేగంగా మెరుగుపడుతోంది. సంస్కరణలు లేకుండా ఇది సాధ్యం కాదు. మన వ్యవస్థలు, పని విధానాలు, దరఖాస్తులు అన్నీ సంక్లిష్టం. వాటిని సంస్కరించాం కాబట్టే మన స్థానం మెరుగుపడింది. ప్రస్తుతం పదో ర్యాంకులో ఉన్న మనం రెండేళ్లలో మూడో స్థానానికి వెళతామని ఒక ఐరాస సంస్థ అంచనా వేసింది. ఇంకా కొన్ని విషయాలను మెరుగుపరచాలి. ఇప్పటికీ కొన్నిచోట్ల లైసెన్స్‌ రాజ్‌ జాడ్యం ఉంది. దాన్ని రూపుమాపాలి. నిర్వాహక, పరిపాలన, న్యాయపాలన... ఇలా ప్రతీ అంచెలో కీలక సంస్కరణలు జరుగుతున్నాయి. 19వ శతాబ్దం నాటి 1700 చట్టాలను తొలగించాం. ఇలాంటి పనికిరాని చట్టాలను తొలగించాలని రాష్ట్రాలకు కూడా చెప్పాం. ఇవన్నీ చాలా పెద్ద సంస్కరణలు. సమాచారం లేకపోవడం వల్ల ప్రజలు సంస్కరణలు జరుగుతున్నట్లుగా భావించకపోవచ్చు. విద్యారంగాన్ని తీసుకోండి. ఎవరూ పట్టించుకోని అంశంపై దృష్టి పెట్టాం. పది ప్రభుత్వ, పది ప్రైవేటు వర్సిటీలకు విశ్వవిద్యాలయ గ్రాంట్ల సంఘం నిబంధనల నుంచి విముక్తి కల్పించాం. వాటికి నిధులిస్తాం. అవి ప్రపంచ స్థాయి వర్సిటీలుగా ఎదగాలి. ఈ క్రమంలో అడ్డం వచ్చే నిబంధనలన్నీ తొలగిస్తాం. ఇప్పుడు చేసి చూపించండని అడుగుతాం. ఇంత పెద్ద సంస్కరణ ప్రజల దృష్టిని ఆకర్షించదు.
* ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. కానీ ప్రైవేటు పెట్టుబడుల్లో జోరు లేదు. స్థిరాస్తి వంటి కొన్ని రంగాలు ఇంకా సంక్షోభంలోనే ఉన్నాయి. అంకుర సంస్థలకు పెట్టుబడులు తగ్గిపోయాయి. ప్రైవేటు రంగానికి, విదేశీ పెట్టుబడిదారులకు మీరిచ్చే సందేశం?
మర్యాద కొద్దీ మీరీ ప్రశ్నను నిర్మొహమాటంగా అడగలేదు. చాలామంది అడిగారు. మోదీజీ, గత రెండేళ్లలో మీరు చేసిన తప్పులేంటి అని. 2014లో తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టినపుడు పార్లమెంటులో నాటి దేశ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం సమర్పించి ఉండాల్సిందని అప్పుడప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నా ముందు రెండు మార్గాలున్నాయి. ఇలాంటి సందర్భాల్లో మొత్తం ఆర్థిక పరిస్థితిని బయట పెట్టాలని నా రాజకీయ అనుభవం చెబుతోంది. జాతి ప్రయోజనాలు నన్ను ఆ పని చేయకుండా ఆపాయి. చేసి ఉంటే దేశ ప్రజల్లో నిస్పృహ బాగా పెరిగేది. షేర్‌ మార్కెట్లు దెబ్బతినేవి. దేశ ఆర్థిక వ్యవస్థకు శరాఘాతం అయ్యేది. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్‌ ప్రతిష్ఠ దిగజారేది. అలాంటి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం చాలా కష్టమయ్యేది. అందుకే, రాజకీయంగా జరిగే నష్టాన్ని భరిస్తూ జాతి ప్రయోజనాల దృష్ట్యా మౌనంగా ఉండిపోయాను. ఆ సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల వాస్తవ చిత్రం అప్పుడప్పుడే బయటకు వస్తోంది. బడ్జెట్‌ అంకెలను ఎలా తిప్పేశారు లాంటి విషయాలు ప్రజలతో పంచుకోలేదు. అది మాకు నష్టం కలిగించింది. మమ్మల్ని విమర్శించారు. అదేదో నా తప్పుగా చూడటం మొదలెట్టారు. నేను రాజకీయ నష్టాన్ని భరించడానికే నిర్ణయించుకున్నా. దాని ఫలితమే ఇప్పుడు వ్యవస్థలకు మరమ్మతులు చేయగలుగుతున్నా. గతంలో జరిగిన తప్పుల కారణంగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గాయి. ఉదాహరణకు బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు. ఇలాంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నా. బ్యాంకుల ముఖ్యులతో సమావేశం అయ్యా. ప్రభుత్వం నుంచి ఫోన్లు రావని చెప్పా. దాంతో బ్యాంకుల్లో వ్యవహారాలు చక్కబడ్డాయి. రోడ్ల నిర్మాణం, రైల్వేల విస్తరణలో వేగం, ఎలక్ట్రానిక్‌ వస్తూత్పత్తి ఆరు రెట్లు పెరగడం వంటివి మేం అడ్డదారుల్లో వెళ్లడం లేదని స్పష్టం చేస్తున్నాయి. ‘‘దగ్గరిదారులు నిన్ను మరుగుజ్జును చేస్తాయి(షార్ట్‌ కట్‌ విల్‌ కట్‌ యు షార్ట్‌)’’ అనే నినాదాన్ని అన్ని రైల్వే స్టేషన్లలో పెట్టాలని అనుకుంటున్నా. అడ్డదారి తొక్కకూడదన్న మా నిర్ణయం ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. మొత్తం మీద పరిస్థితులు మెరుగుపడ్డాయి. కానీ, మే 2014 నాటి పరిస్థితి గురించి మీకు చెప్పాలి. నేను కఠిన మార్గాన్ని ఎంచుకున్నా. నిష్పాక్షిక వ్యక్తులు పరిస్థితిని విశ్లేషిస్తే తప్పకుండా వాళ్లు ఆశ్చర్యపోతారని నేను నమ్ముతున్నా.

నేరుగా నగదు బదిలీ మరో పెద్ద సంస్కరణ. గతంలో గ్రామీణ ఉపాధి హామీ డబ్బులు ఎవరి జేబులోకి పోయేవో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నేరుగా నగదు బదిలీతో లబ్ధిదారు ఖాతాకు వెళ్తున్నాయి. వంటగ్యాస్‌ సబ్సిడీ, విద్యార్థుల ఉపకార వేతనాలకూ ఇదే పద్ధతి. ఇవన్నీ నా దృష్టిలో పాలనా సంస్కరణలు. పారదర్శకతకు నిదర్శనాలు. నానాటికీ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. వాటి సాయంతో సంస్కరణలను పెద్దఎత్తున ముందుకు తీసుకెళ్లాలి. సంస్కరణలకు కేంద్ర బిందువు సామాన్య మానవుడే. సామాన్యుడి జీవితం మరింత సాఫీగా సాగాలంటే, అతడి హక్కులు అతనికి దక్కాలంటే ఏం చేయాలన్నదే మా ఆలోచన.
* జమ్మూ కశ్మీర్‌ అట్టుడుకుతోంది. అక్కడి ప్రభుత్వంలో మీ పార్టీ భాగస్వామిగా ఉంది. పరిస్థితులు క్షీణిస్తున్నాయి. మీ ఉద్దేశంలో పరిస్థితిని మెరుగుపరచడానికి ఏం చర్యలు తీసుకోవాలి? 
జమ్మూ కశ్మీర్‌ గురించి మనం మాట్లాడినప్పుడల్లా జమ్మూ, కశ్మీర్‌ లోయ, లద్దాఖ్‌ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్వాతంత్య్రం, దేశ విభజన సమయంలోనే ఈ సమస్య తలెత్తింది. ఆ తర్వాత ప్రతి ప్రభుత్వమూ ఈ సమస్యతో పోరాడాల్సి వచ్చింది. కశ్మీర్‌ యువత పక్కదారి పట్టరని విశ్వసిస్తున్నా. కశ్మీర్‌ను భూతల స్వర్గంగా కొనసాగేలా.. శాంతి, ఐక్యత, సుహృద్భావాన్ని నెలకొల్పేందుకు ఉమ్మడిగా కృషి చేస్తాం. అందుకే.. కశ్మీర్‌ ప్రజలకు అభివృద్ధి, విశ్వాసం రెండూ అవసరమని నేను ఎప్పుడూ చెబుతుంటా. ఈ మార్గాల్లోనే పయనాన్ని సాగించి విజయం సాధిస్తాం. 

పది రోజుల్లో ఎన్నికలన్నీ ముగిస్తేనే... 
* వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే ఎన్నికలను దేశం నిశితంగా పరిశీలిస్తుంది. వాటిని మినీ జాతీయ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. ఆ ఎన్నికల్లో అతిపెద్ద అంశం ఏదవుతుంది? మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయి? 
మన దేశంలో దురదృష్టకరమేమిటంటే మనం ఏం చెప్పినా, చేసినా వాటిని ఎన్నికలతో ముడి పెడుతుంటారు. మరో 16 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగానే.. వాటిని దృష్టిలో పెట్టుకొనే మీరు పనులు చేస్తున్నారంటారు. అందువల్ల ఈ రాజకీయ పండితుల మది నిండా రాజకీయాలే. పైగా మన దేశంలో అక్కడో ఇక్కడో తరచూ ఎన్నికలు జరగుతుంటాయి. అందువల్ల ప్రతి నిర్ణయాన్నీ ఎన్నికల త్రాసుతో తూస్తుంటారు. అంశాలు, నిర్ణయాలను ఎన్నికలతో ముడి పెడుతున్నంత కాలం దేశానికి నష్టం తప్పదు. ఇప్పుడు ఈ రెండు అంశాలను విడగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికలను ప్రకటించాకే పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయాలి.
రాజకీయ పార్టీల నేతలు నన్ను కలిసినప్పుడు ఎన్నికల అంశాన్ని పక్కన పెట్టేదామని అంటుంటారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలను కలిపి నిర్వహిద్దామంటుంటారు. స్థానిక ఎన్నికలను కూడా అదే సమయంలో ఎందుకు నిర్వహించకూడదు? అందువల్ల ఎన్నికల ప్రక్రియ మొత్తం వారం నుంచి పది రోజుల వ్యవధిలో ముగిసిపోతుంది. అప్పుడు దేశం ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సాగిపోతుంది. అప్పుడు నిర్ణయాలు, కదలిక ఉంటాయి. అధికార వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. ప్రతి పార్టీ ఇదే చెబుతోంది. అయితే ఏదో ఒక్క పార్టీ మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోజాలదు. అందరూ ఉమ్మడిగా చేయాలి. ఈ క్రతువుకు ఎన్నికల సంఘం చొరవ చూపాలి. అన్ని పార్టీలూ ఇందుకు అంగీకరించాలి. దీనిపై భవిష్యత్‌లో సమగ్ర చర్చ జరుగుతుందని ఆశిస్తున్నా.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో పునరేకీకరణ జరగొచ్చన్న ఆందోళనలున్నాయి కదా? 
కులతత్వం, మతతత్వ ఓటుబ్యాంకు వల్ల దేశానికి ఇప్పటికే గణనీయ నష్టం జరిగింది. మన ప్రజాస్వామ్య బలోపేతం దిశగా ఉన్న అతిపెద్ద అడ్డంకి ఓటు బ్యాంకు రాజకీయాలే. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల వాతావరణం లేదు. అభివృద్ధి రాజకీయాల వాతావరణమే ఉండింది. 30 ఏళ్ల తర్వాత ప్రజలు ఉమ్మడిగా మెజార్టీ ప్రభుత్వానికి ఓటేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అభ్యున్నతి కోసం ఆ రాష్ట్ర ప్రజలంతా ఇదే రీతిలో ఓటేస్తారని నమ్ముతున్నా.

రానున్న రోజుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. వాటిలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ఒకటి. భాజపా అభివృద్ధి అంశాలపైనే పోరాడుతుంది. రైతుల సంక్షేమం, గ్రామాలు, యువతకు ఉద్యోగాలు వంటి అంశాలపైనే మా ప్రధాన దృష్టి. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. దేశంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కొనసాగించడంపై దృష్టి ఉంటుంది.
(Source- Eenadu)



ముఖ్యాంశాలు

1 comment: